బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు లపై కేసు నమోదైంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్రలో.. రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా భాగ్యనగరంలో భారీ శోభాయాత్రలు నిర్వహించారు. ఈ శోభాయాత్రల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ర్యాలీలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
కాగా.. శోభాయాత్రలో భాగంగా.. కోఠి ఆంధ్ర బ్యాంక్ చౌరాస్తాలో టస్కార్ వెహికల్ లో డీజే సౌండ్స్ పెట్టారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారని.. వారి చర్యల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుచిత వ్యాఖ్యలు, ప్రజలకు అంతరాయం, నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో వారిరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భిక్షపతి తెలిపారు. కాగా.. యూపీ ఎన్నికల సమయంలో బుల్ డోజర్లు వస్తాయని చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో కూడా రాజాసింగ్ పై కేసు నమోదైంది.