యువగళం పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేశ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. తాజాగా సంసిరెడ్డి పల్లెలో లోకేశ్ ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఆయన మైక్‌ను పోలీసులు లాగేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మైక్ తీసుకుని వస్తున్న భాషా అనే వ్యక్తిని అడ్డుకుని మైక్ ను గుంజు కున్నారు. లోకేష్ నిల్చున్న స్టూల్ ను కూడా లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మైక్ ఎందుకు లాక్కున్నారంటూ పోలీసులను నిలదీశారు.
పోలీసులు తీరుపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టూల్ మీదే నిలబడి ఆయన నిరసన తెలిపారు. తమది అంబేడ్కర్ రాజ్యాంగం అన్నారు. మీ లాంటి కొంతమంది పోలీసుల వల్లే పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తోందన్నారు. తమను అడ్డుకోవాలనుకుంటున్న మీ రాజ్యంగంతో తమకు పని లేదన్నారు.
ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో యువగళం యాత్ర మొదలైంది. దాదాపు ఐదారు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత గంగాధర నెల్లూరు మండలం సంసిరెడ్డిపల్లె వద్దకు పాదయాత్ర చేరుకుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు రెడీ అయ్యారు.
ఈ క్రమంలో హ్యాండ్ మైక్ తీసుకువెళ్తున్న కార్యకర్తను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. ఇక్కడ మాట్లాడేందుకు వీలులేదంటూ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.