ఎమ్మెల్యే రాజా సింగ్ ను కేసులు వెంటాడుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన స్పీచ్ పై ఒక్కో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయి. శనివారం అఫ్జల్ గంజ్ పీఎస్ లో కేసు ఫైల్ కాగా.. తాజాగా షా ఇనాయత్ గంజ్ పోలీసులు రాజా సింగ్ పై కేసు పెట్టారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎస్‌ఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది.
శోభాయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని పరిచయం చేస్తూ.. ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో వివరించారు. దీంతో రాజాసింగ్ పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అఫ్జల్ గంజ్ పీఎస్ లో రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఎస్‌ఐ వీరబాబు ఫిర్యాదు మేరకు రాజా సింగ్ పై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
గతంలో మునావర్ షో కు సంబంధించి వివాదాస్పద వీడియో విడుదల చేసి జైలు పాలయ్యారు రాజాసింగ్. పోలీసులు పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయితే.. కోర్టు పలు కండిషన్స్ తో బెయిల్ ఇచ్చింది. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది. బెయిల్ పై బయటకొచ్చాక.. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజాసింగ్. ఆ సమయంలో విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై ఈమధ్యే కేసు నమోదైంది. ఇవే వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. తాజాగా మరో రెండు కేసులు రాజాసింగ్ పై ఫైల్ అయ్యాయి.
మరోవైపు శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు రాజా సింగ్. కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి తనను మళ్లీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ధర్మం గురించి మాట్లాడినా, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడినా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, తెలంగాణ భారతదేశంలో ఉందా లేదా? పాకిస్థాన్ లో ఉందా? అంటూ ప్రశ్నించారు రాజా సింగ్.