రాష్ట్ర బీజేపీ నేతలేమో కేసీఆర్ అవినీతిపరుడు… జైలుకు పంపుతాం… ఆయన అవినీతి చిట్టా మా దగ్గర ఉంది అని ప్రసంగాలు చేస్తారు. కేసీఆర్ పనైపోయింది, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని స్వయంగా బండి సంజయ్ ఎన్నోసార్లు ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్రలో దూసుకపోతూ రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్ పై పోరాటం చేస్తుంటే, బీజేపీ కీలక నేతలు మాత్రం కేసీఆర్ తో వరుసగా భేటీ కావటం చర్చనీయాంశం అవుతోంది.
ఢిల్లీలో కేసీఆర్ ప్రధానిని కలిసిన తర్వాతే హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వాయిదా పడిందని, బీజేపీ-కేసీఆర్ మిత్రులే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓ టైంలో రాష్ట్ర బీజేపీ నేతలంతా డిఫెన్స్ లో పడిపోయారు. సెప్టెంబర్ 17న రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారని… ఆయనతోనే కేసీఆర్ పై పోరాటం విషయంలో పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇప్పించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్న తరుణంలో పార్టీకి మరోసారి సంకట స్థితి ఏర్పడింది.
Advertisements
బీజేపీలో యువ నాయకుడిగా ఉన్న కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. కలిసి లంచ్ చేశారు. దీంతో ఈ విందు భేటీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండగా, బీజేపీ శ్రేణులకు ఇరకాటంగా మారింది. రాష్ట్ర నాయకత్వం కేసీఆర్ పై పోరాడుతున్నట్లుగా కనపడుతుంటే… కేంద్ర నాయకత్వం మాత్రం దోస్తీ చేస్తుందా అని అనుమానిస్తున్నారు. ఇటీవల యువ ఎంపీ తేజస్వీ సూర్య కేసీఆర్ ను విమర్శించిన గంటల వ్యవధిలో కేటీఆర్ తో సమావేశంలో పాల్గొనటం, ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నాయకుడికి కేసీఆర్ విందు ఇవ్వటంపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.