కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా కుక్కల దాడికి మరో ప్రాణం బలైంది. తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది. కుక్క కాటుకు 13 ఏళ్ల బాలిక చనిపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో నెల రోజుల క్రితం 13 సంవత్సరాల అమ్మాయికి ఓ కుక్క కరిచింది.
అప్పుడే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అమ్మాయి చనిపోయింది. కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాలు, గ్రామాల్లో వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు గురవుతున్నారు. రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చుతోంది.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు అడుగు ముందుకు పడడం లేదు. వాటి సంతతి పెరుగుతున్నా.. నివారణకు అధికారులు చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట చిన్నారుల నుంచి పెద్దల వరకు కుక్కల దాడిలో గాయపడుతూనే ఉన్నారు. 2023, ఫబ్రవరి 19న హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో నాలుగేళ్ళ బాలుడు కుక్కల దాడిలో చనిపోయాడు. ఆ సందర్భంగా నాలుగు రోజులు అధికారులు హడావుడి చేసి కుక్కలను పట్టకున్నారే తప్ప వాటికి శస్త్ర చికిత్సలు చేసిందీ లేదు. సమస్య మళ్లీ మొదటికి రావడంతో బల్దియాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కల సమస్యలపై సంబంధిత అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రోజుకూ వందల్లో ఫిర్యాదులొస్తున్నా 10 శాతం కూడా పరిష్కరించడం లేదు.