కానిస్టేబుల్ అభ్యర్థుల వరుస ఆత్మహత్యలు కలకలాన్ని రేపుతున్నాయి. మార్కులు తక్కువ రావడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న అభ్యర్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా పోలీసు డిపార్ట్ మెంట్లో చేరాలన్న వారి చిరకాల కల రెండు మూడు మార్కులతో చెదిరిపోవడంతో అభ్యర్థులు ప్రాణాలనే తీసుకుంటున్నారు. కన్నవారికి కడు విషాదాన్ని మిగుల్చుతున్నారు.
తాజాగా మూడు మార్కులు తక్కువ రాడంతో మనస్థాపానికి గురైన అభ్యర్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీస్ డిపార్ట్ మెంట్లో విధులు నిర్వహించాలని కష్టపడి అన్ని పరీక్షలు పాస్ అయిన అతనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మూడు మార్కులు తక్కువ రావడంతో ఇక తన కోరిక నెరవేరదని భావించి సింగారం గ్రామానికి చెందని జక్కుల రాజ్ కుమార్ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రభుత్వం ఏడు మార్కులు కలుపుతుందని భావించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 4 వ తేదీన పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
శుక్రవారం రాత్రి 10 గంటలకు రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ ఎంజీఎం మార్చురీకి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తప్పుగా వచ్చిన ఆ 7 ప్రశ్నలకు మార్కులు కలిపి ఉంటే తమ కొడుకు బతికేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా 7 మార్కులను కలిపి ఇలాంటి ఆత్మహత్యలకు ముగింపు పలకాలని కోరుతున్నారు.