కరోనా వైరస్ సోకి ముంబైలో ఫిలిప్పీన్స్ కు చెందిన 68 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అతనికి కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకి కోలుకున్నాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. దీంతో ముంబైలో కరోనా వైరస్ కు సంబంధించి చనిపోయిన వారి సంఖ్య మూడు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం ఇతనికి కరోనా వైరస్ చావుగా గుర్తించడం లేదు. అతను కరోనా వైరస్ సోకిన తర్వాత కోలుకున్నాడని..నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని పేర్కొంది. ఆ వ్యక్తికి మొదట కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో కస్తూర్భా హాస్పిటల్లో చేరి చికిత్స పొందాడు. ఆ తర్వాత అతనికి వైరస్ నెగిటివ్ అని తేలింది. దీంతో అతనిని దిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత అతను అనారోగ్య కారణాలతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ తెలిపింది. మృతునికి డయాబెటిస్, అస్త్మా, ఇతర శ్వాస సంబంధ సమస్యలు కూడా ఉన్నాయని అతనికి చికిత్స చేసిన కస్తూర్భా హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.
అంతకు ముందు రాజస్థాన్ లో ఓ 69 ఏళ్ల ఇటలీ దేశస్థుడు చనిపోయాడు. అతను కూడా కరోనా పాజిటివ్ తో హాస్పిటల్లో చేరడంతో కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. అతన్ని కూడా కరోనా మృతుల జాబితాలో చేర్చలేదు.
ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారు ఏడుగురు. మొత్తం 415 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 24 మంది డిశ్యార్జ్ అయ్యారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 18,383 శాంపిల్స్ ను టెస్ట్ చేసింది.
తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 67, కేరళలో 67 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీలో 29, ఉత్తరప్రదేశ్ లో 28, రాజస్థాన్ లో 27,తెలంగాణలో 30, కర్ణాటకలో 26 కేసులు నమోదయ్యాయి. ఇంకా హర్యానా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ల నుంచి కేసులు నమోదవుతున్నాయి.