నివర్ తుఫాన్ ప్రభావం కొనసాగుతుండగానే ఏపీకి మరో తుఫాను ముప్పు వచ్చేలా ఉంది. ఈనెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించగా, తీవ్ర వాయుగుండం కాస్తా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుఫాన్‌లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై తుఫాన్ ప్రభావం ఉండనుంది.
నివర్ తుఫాన్ ఇప్పటికే తీరం దాటినా ఏపీపై ప్రభావం మాత్రం కొనసాగుతోంది. రాగల 6 గంటల్లో వాయుగుండంగా ఆ తర్వాత అల్పపీడనంగా బలహీన పడనుంది. ప్రస్తుతానికి తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కీమీ దూరంలో చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
శుక్రవారం సాయంత్రంకు మెల్లిగా నివర్ ప్రభావం తగ్గుతూ క్రమంగా బలహీనపడనుంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి , కృష్ణా , గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడుతుండగా, శనివారం కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి ,రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నాయి.