– చేష్టలుడిగిన కేసీఆర్ సర్కార్
– కర్నాటక విషయంలో మెతక వైఖరెందుకు?
– ఇరిగేషన్ కూడా మీరే కదా..ఏమంటారు?
సాగు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సర్కార్ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్టుగా ఉంటోంది. ఇప్పటికే ఏపీ సర్కార్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మొదట్లోనే నోరు విప్పకుండా సమస్యను పెద్దదిగా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కర్ణాటక విషయంలోనూ అదే మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తుంగభద్ర డ్యామ్‌కు సమాంతరంగా మరో జలాశయం నిర్మించాలని కర్నాటక ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. ఏడేళ్ల క్రితం ప్రతిపాదించిన ప్రాజెక్టును మెల్లగా పట్టాలెక్కిస్తోంది.ఇందుకు సంబంధించిన డీపీఆర్( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను తయారు చేసే పనిలో పడింది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రకటన చేసింది. కానీ తెలంగాణ నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఏడేళ్ల క్రితం ఇదే ప్రతిపాదన వచ్చినప్పుడు..వాటాదారులను సంప్రదించకుండా కొత్త ప్రాజెక్టు ఏమిటని అప్పట్లో సాగునీటి మంత్రిగా ఉన్న హరీష్ రావు.. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. అయితే ప్రాజెక్టు పూర్తిగా కర్నాటక పరిధిలోనే ఉండటంతో.. అక్కడితోనే ఆగిపోయారు.
తుంగభద్ర డ్యామ్‌ను 1953లో 1953లో నిజాం ప్రభుత్వం.. మద్రాస్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాయి. 130 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా..పూడిక కారణంగా 100 టీఎంసీల సామర్థ్యాన్ని మాత్రమే ఇప్పుడు కలిగి ఉంది. దీంతో అందుకు బదులుగా 35 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రాజెక్టును నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. నవల్లి గ్రామంలో ఈ సమాంతర జలాశయాన్ని నిర్మిస్తామని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి గోవింద కారజోల ఇటీవల చెప్పారు. కొత్త ఆనకట్ట నిర్మాణానికి ఏపీ, టీఎస్ల సమ్మతిని తీసుకోవడానికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తెలగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇంతవరకు తుంగభద్ర నదిలో తెలంగాణ తన వాటా ఎంతో తేల్చుకోలేకపోయింది.