బాలీవుడ్ లో మరో డిజాస్టర్ పడింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన సర్కస్ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఇదేదో అషామాషీ సినిమా కాదు. దిగ్గజాల్లాంటి నటీనటులు, టెక్నీషియన్స్ కలిసి పని చేసిన సినిమా.
కమర్షియల్ సినిమాకు కొత్త రూల్స్ రాసిన రోహిత్ షెట్టి ఈ సినిమాకు దర్శకుడు. అదిరిపోయే పెర్ఫార్మర్ రణవీర్ సింగ్ హీరో. పూజాహెగ్డే హీరోయిన్. స్టార్ హీరోయిన్ దీపికా పడుకొణె, హీరో అజయ్ దేవగన్ స్పెషల్ రోల్స్. ఇంత ప్యాడింగ్ పెట్టుకొని కూడా సర్కర్ సినిమా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాకు 150 కోట్ల రూపాయలు (ప్రమోషన్ తో కలిపి) ఖర్చయింది. కనీసం 200 కోట్ల రూపాయలు వస్తాయని మేకర్స్ అంచనా వేశారు. కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. మహా అయితే మరో 10 కోట్లు రావొచ్చని అంచనా. సో.. ఎలా చూసుకున్నా.. ఈ సినిమా రన్ ముగిసేసరికి బయ్యర్లకు 110 కోట్ల రూపాయలకు పైగా నష్టం గ్యారెంటీ అని తేలిపోయింది.
బాలీవుడ్ లో ప్రస్తుతం ఏ సినిమా అడుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలకు అక్కడి జనం బ్రహ్మరథం పడుతున్నారు. కాంతార, విక్రమ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరోవైపు సర్కస్ లాంటి స్ట్రయిట్ హిందీ సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నాయి.