అదును చూసి భారత్ ను దెబ్బకొట్టడానికి దాయాది దేశం పాకిస్థాన్ ఎప్పుడు నిఘా పెడుతూనే ఉంటుంది. అందులో భాగంగా నిత్యం మన భూభాగంలోకి డ్రోన్లను పంపుతూ ఉంది. ఈ యేడాదిలో దాదాపు 230 దాకా డ్రోన్లను భారత్ సరిహద్దుల్లోకి పంపడం మన సైన్యం ధ్వంసం చేయడం జరిగింది. తాజాగా పంజాబ్ లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోకి మరో రెండు డ్రోన్లు కలకలం సృష్టించాయి.
అమ్రుత్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో కూడా మరో డ్రోన్ హల్ చల్ చేసింది. తలనొప్పిగా మారిన ఈ డ్రోన్ల దాడిని అరికట్టేందుకు ఇండియన్ ఆర్మీ ఓ ఇంట్రస్టింగ్ ఆయుధాన్ని సిద్ధం చేసింది. అదే పక్షిరాజు గద్ద. మన హిందూ పురాణాల్లో గద్దకు గరుత్మంతుడని పేరుంది. విష్ణుమూర్తి వాహనంగా ప్రత్యేక స్థానం ఉంది. పాకిస్థాన్ దొంగచాటుగా పంపించే డ్రోన్ల పనిపట్టడానికి మన ఇండియన్ ఆర్మీ గరుత్మంతుడినే ఆయుధంగా ఉపయోగిస్తోంది. చొరబాటు డ్రోన్లను గుర్తించి నేల కూల్చడానికి గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
భారత్, అమెరికా సైన్యాల మధ్య అత్యుత్తమ అభ్యాసాలు, వ్యూహాలు, సాంకేతిక విషయాలు, విధానాలు పరస్పరం ఇచ్చుపుచ్చుకోడమే లక్ష్యంగా ఇరుదేశాలు “యుద్ధ అభ్యాస్” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రతి సంసవత్సరం విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. అందులో భాగంగా ఉత్తరాఖండ్ లోని జౌలీలో చైనా సరిహద్దు వద్ద ఇరు దేశాలు నిర్వహిస్తున్న “యుద్ధ అభ్యాస్ “లో గద్దలతో డ్రోన్లను కూల్చే పద్ధతిని ప్రదర్శించారు.
ముందుగా డ్రోన్ ని గాల్లోకి పంపిస్తారు.. దాని శబ్ధాన్ని ఓ సునకం గ్రహించి సిబ్బందికి హింట్ ఇస్తుంది. అప్పుడు తర్ఫీదు పొందిన అర్జున్ అనే గద్ద డ్రోన్ ని కనిపెట్టి గాల్లోనే దాన్ని కూల్చేసింది. ఇప్పటికే ఆర్మీ పలు శునకాలకు, గద్దలకు శిక్షణ ఇచ్చింది. ప్రదర్శనా కార్యక్రమాల్లో దీన్ని ఉపయోగిస్తుంది. అయితే.. ఈ విధంగా చొరబాటు డ్రోన్ల భరతం పట్టడానికి పురాణ ప్రాధాన్యం ఉన్న గద్దను ఉపయోగించడం ఇదే తొలిసారి.