తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈమధ్య అప్పుల బాధతో రైతన్నలు తనువు చాలిస్తున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో మరో రైతు సూసైడ్ చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఏటూరు నాగారానికి చెందిన పోతురాజు(55) కౌలు రైతు. ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాడు. చీడ పీడ సోకకుండా ఉండేందుకు బ్యాంకులో రుణం తీసుకుని మరీ పురుగుల మందు పిచికారీ చేశాడు. బయట కూడా వడ్డీకి డబ్బులు తెచ్చి సాగు చేశాడు.
అంతా సజావుగా సాగుతోందని సంతోషంగా ఉండగా పంటకు వైరస్ సోకి పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలోనే తెగుళ్లు నయం కాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీరుతాయని మనస్తాపం చెంది చీడపీడకు వాడదామని తెచ్చిన పురుగులమందునే తాగి ఆత్మహత్య చేసుకున్నాడు పోతురాజు.
సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఏటూరునాగారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.