నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట ఫైనాన్స్ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో చిట్యాల సాయిబాబా, ధనుంజయ్ తో పాటు మరో ఆరుగురు కలిసి శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన కస్టమర్ల నుండి నగదు డిపాజిట్ రూపంలో సేకరించారు.
కస్టమర్లను నమ్మించి కోట్ల రూపాయల నగదు భారీ మొత్తంలో సేకరించిన తర్వాత ప్లేట్ ఫిరాయించారు. గత 8 నెలల నుండి ఈ తతంగమంతా జరుగుతూనే ఉంది. డిపాజిట్ దారులు ఆందోళనలు చేస్తూ ఫైనాన్స్ కంపెనీ చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయారు.
దీంతో పోలీసులకు ఫిబ్రవరి 9న ఫిర్యాదు చేశారు. తక్షణమే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. నేటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం మరోసారి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. వీరికి స్థానిక నాయకులు కొందరు మద్దతుగా నిలిచారు. కంపెనీ యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.