తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. తమ కూతురిని ప్రేమించాడని మహేష్ అనే యువకుడిపై అమ్మాయి తరుపు బంధువులు దాడి చేయటంతో… మహేష్ చికిత్స పొందుతూ మరణించాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్ పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.
మహేష్ ప్రేమించిన అమ్మాయి బంధువే అవుతుంది. బంధువుల అమ్మాయే కావటంతో పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారని మహేష్ భావించాడు. విషయం అమ్మాయి తరపు బంధువులకు తెలిసింది. ప్రేమ పెళ్లి ఇష్టంలేని అమ్మాయి తరుపు బంధువులు… పథకం ప్రకారం తమ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు పిలిచి అంతా కలిసి దాడి చేశారు. ఈ దాడిలో మహేష్ కు బలమైన గాయాలు కావడంతో రక్తం గడ్డకట్టి చికిత్స పొందుతూ మరణించాడు.
మహేష్ ను అమ్మాయి తరుపు బందువులు కొట్టడంతో మృతి చెందాడని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. తీవ్రంగా కొట్టి తన కొడుకు ప్రాణాలు తీశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మూడేళ్ల క్రితేమ కౌల్‌పూర్ గ్రామానికి వచ్చామని, తన భర్త కూడా ఊరికి రాగానే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మహేష్ తల్లి డిమాండ్ చేస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.