కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎక్కువ అవకాశాలున్న భారత ఫార్మా కంపెనీలు ఇతర దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దేశీయంగా రష్యన్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఆర్‌డీఐఎఫ్‌తో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో పేర్కొంది. ఏడాదికి 10 కోట్ల డోసేజీల తయారీని చేపట్టనున్నట్లు తెలిపింది.
2021 మొదట్లో వ్యాక్సిన్ తయారీ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్‌డీఐఎఫ్ పేర్కొంది. వ్యాక్సిన్ తయారీకి హెటెరోకు ప్రత్యేకించిన యూనిట్ లేకున్నప్పటికీ హైదరాబాద్‌లోగల బయోఫార్మాస్యూటికల్ ప్లాంటులో వ్యాక్సిన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. దేశీయంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు 2021 మార్చిలోగా పూర్తికావచ్చని ఇటీవల డాక్టర్ రెడ్డీస్ అంచనా వేస్తుంది.
ఈ వ్యాక్సిన్ ధర వెయ్యి రూపాయల లోపే ఉంటుందని అంచనా ఉండగా, ఇప్పటికే పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈ రష్యన్ వ్యాక్సిన్ 94శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ప్రకటించుకుంది.