తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల చావులు ఆగడం లేదు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో తనువు చాలిస్తున్నారు కొందరు స్టూడెంట్స్. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా చనిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గజానంద్ కు నందిని అనే కుమార్తె ఉంది. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే.. ఈనెల 15న విడుదలైన ఫస్టియర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది.
తమ బిడ్డ మొదటి తరగతి నుంచి మంచి మార్కులు పొందుతూ ఉండేదని.. ఇప్పుడు రెండు సబ్జెక్టులు తప్పడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి గజానంద్ తెలిపారు. శుక్రవారం రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించామని.. అప్పటి నుండి చావు బతుకుల మధ్య పోరాడి బుధవారం మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని కన్నీరుమున్నీరయ్యారు.
నందిని మృతి చెందిన విషయం తెలిసి… గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల చావులకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రిని, ఇంటర్ బోర్డు కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేశారు. నందిని కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటన రాకపోతే.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.