మలయాళంలో మరో సినిమా పెద్ద హిట్టయింది. ఈ సినిమా పేరు రోమాంచం. కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
అన్ని సినిమాల్లానే ఈ సినిమాలో కూడా పెద్ద ఆర్టిస్టుల్లేరు. అంతా కొత్త వాళ్లతో తీశారు. ఎక్కువగా మలయాళ సినిమాల్లో కనిపించే సౌచిన్ షాహిర్ ఇందులో లీడ్ రోల్ పోషించాడు. 2007 బ్యాక్ డ్రాప్ లో హారర్-కామెడీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు.
కొత్తదనాన్ని ఆహ్వానించే మలయాళీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సైతం రోమాంచం చూసి అనుమానపడ్డారు. ఈ సినిమా ఆడదని ఫిక్స్ అయిపోయారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు దొరకడమే కష్టమైంది. ఎలాగోలా డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి రిలీజ్ చేశారు.
అలా రిలీజ్ అవ్వడమే కష్టం అనుకున్న ఈ సినిమా, అతిపెద్ద విజయం సాధించింది. ఫిబ్రవరి 3న విడుదలై, ఇప్పటివరకు 50 కోట్ల రూపాయలు ఆర్జించింది.
మలయాళంలో ఓ సినిమా హిట్టయితే చాలు, టాలీవుడ్-బాలీవుడ్ మేకర్స్ ఎగబడతారు. ఇప్పుడీ రోమాంచం సినిమా రీమేక్ రైట్స్ కు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో త్వరలోనే తెలుస్తుంది.