అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని హఫ్ మూన్‌బే నగరంలో ఓ దుండగుడు మంగళవారం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు చైనా- అమెరికా ఫార్మ్ వర్కర్స్ గా పోలీసులు గుర్తించారు.
నాలుగు మృత దేహాలను పుట్టగొడుగుల పెంపక కేంద్రం వద్ద, మరో మూడు డెడ్ బాడీలను ట్రక్కు వద్ద పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు.
అమెరికాలో ఇది వరుసగా మూడో కాల్పుల ఘటన కావడం గమనార్హం. కాల్పులు జరిపిన నిందితుడు తమ కస్టడీలో ఉన్నట్టు శాన్ మాటియో కౌంటీ ఒక ట్వీట్‌లో పేర్కొంది. కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌లో 72 ఏండ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు.
ఆ కాల్పుల్లో మొత్తం 10 మంది మరణించారు. ఆ ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. నిందితుడు ఉన్న వ్యాన్ వద్దకు పోలీసులు వెళ్లే సరికి కాల్పులు శబ్దం వినిపించింది. నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.