ఏ స్థాయి ప్రజాప్రతినిధుడైనా పరిపాలన కొనసాగించే అధికారులకు, శాంతి భద్రతల్ని పరిరక్షించే పోలీసులకు సహాకరించాలి. వారికి మార్గదర్శకంగా నిలవాలి. కానీ, గ్రేటర్ హైదరాబాద్‌లో కార్పొరేటర్లు పోలీసులపై తన జులుం ప్రదర్శిస్తున్నారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై పబ్లిక్‌గా రెచ్చిపోతున్నారు. తమను ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఖాకీలపై వీరంగం సృష్టిస్తోన్నారు. కార్పొరేటర్ల తీరుతో ఏం చేయలో అర్థం కాని దుస్థితిలో పోలీసులు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోలక్‌పూర్ కార్పొరేట్ ఘటన మరకవముందే.. తాజాగా పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ వీరంగం సృష్టించాడు.
పాతబస్తీలో బుధవారం అర్థరాత్రి చార్మినార్ పత్తర్ గట్టి ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ సోహెల్ ఖాద్రి పోలీసులపై విరుచుకుపడ్డాడు. చార్మినార్ పోలీసు స్టేషన్ పరిధిలో యునాని ఆస్పత్రి ముందు పార్క్ చేయడంతో స్థానికులు 100 కాల్ చేశారు. ఫోన్ కాల్‌తో ఘటన స్థలానికి ఎస్సై వచ్చాడు. అక్కడికి వచ్చిన ఎస్సైని పట్టుకుని ఎంఐఎం కార్పొరేటర్ నానా హంగామా చేశాడు.
25 ఏండ్ల నుంచి ఇక్కడే పార్కింగ్ చేస్తున్నామని.. మీకు ఎవరు కంప్లైంట్ చేశారని కార్పొరేటర్ పోలీసులకు ఎదురుతిరిగాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తమాషా చేస్తున్నావా అంటూ పత్తర్ గట్టి కార్పొరేటర్ దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా పోలీసులకి ఫిర్యాదు చేసిన యునాని హాస్పిటల్ సిబ్బంది పై కూడా సయ్యద్ మండిపడ్డారు.
కాగా, ముషీరాబాద్‌లో పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్‌లో పోలీస్ విధులను అడ్డుకోవడమే కాకుండా.. వారిపై దురుసుగా ప్రవర్తించారు. బోలక్‌పూర్‌లో పోలీసులతో కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. డీజీపీకి చేసిన ట్వీట్‌పై పోలీసులు స్పందించారు.