మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి యాత్రలో పాల్గొనలేక పోతున్నారని అన్నారు. ప్రజలు కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ఇక ముగిసిందన్నారు. పది బడ్జెట్ లలో 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని..ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 20వేల కోట్లు ఖర్చు చేయాలని.. మరి అభివృధ్ది ఎక్కడుందని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇల్లందు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయిందని నిలదీశారు.రూ.5వేల కోట్లు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని, ఆరోగ్యశ్రీ లో 800 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. 2003 కు ముందు విద్యుత్ కోతలు ఉన్నట్లే.. ఇవాళ కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులు ఉన్నాయని రేవంత్ అన్నారు. ఆనాడు ఎదుర్కున్నట్లుగానే ఈనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నామని చెప్పారు.
ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కుప్పకూలిందన్న ఆయన సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ అమలు చేసి చూపిందన్నారు. రైతులకు అనుకూలమైన విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారన్నారు.ప్రయివేటు విద్యుత్ సంస్థల్లో 50శాతం కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 20వేల కోట్ల బకాయి పడిందని.. ట్రాన్స్ కో, జెన్ కో కలిపి 60వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయన్నారు. విద్యుత్ కొనుగోళ్ళల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే తన నమ్మిన బంట్ల వద్ద కొనుగోలు చేశారన్నారు.గుజరాత్ కంపెనీతో వెయ్యి కోట్లు లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని కొన్నారన్నారు రేవంత్.
తొమ్మిదేళ్లయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేయలేదన్నారు.కేసీఆర్ దోపిడీ వల్లే విద్యుత్ సంస్థలు కుప్పకూలిపోయాయన్న రేవంత్..రైతులు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నారన్నారు. 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్ళపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీడీ చార్జీలు రద్దు చేస్తుందన్నారు.రైతు సంఘాలు, రైతులు అందరం రోడ్డెక్కుదామని..బషీర్ బాగ్ ఉద్యమం లాంటి మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.