ఓటుకు నోటు కేసులో ఉన్నన్ని ఎత్తులు-పై ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు… ఇందులో రాజకీయ ఎత్తులు అనేకం. నేతలంతా పార్టీలకు అతీతంగా ఏకమవుతూ… రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో అసలేం జరుగుతుందో తెలిస్తే… షాక్ అవ్వాల్సిందే.
ఓటుకు నోటు కేసులో మత్తయ్య గుర్తుండే ఉంటుంది. కేసు మొదట్లో ఈ పేరు తెరపైకి వచ్చినా… తనకు ఈ కేసుతో సంబంధం లేదని హైకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తర్వాత కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. 2015నాటి కేసు ఇప్పుడు తెర మీదకు రాగా… కేసుతో మత్తయ్యకు సంబంధం లేదని హైకోర్టు చెప్పాక కూడా ఈడీ ఇప్పుడు ఎంటరయ్యింది.
కేసు ఇప్పుడే ఎందుకు యాక్టివ్ అయ్యింది, ఈడీ ఇప్పుడే ఎందుకు తెర మీదకు వచ్చింది, ఈ మొత్తం కేసులో పార్టీలకు అతీతంగా నేతలంతా కలిసి ఎవర్నీ టార్గెట్ చేసిట్లు… ఇందులో కేసు మీద ప్రేమ ఎంత? ఆశిస్తున్న రాజకీయ ప్రతిఫలం ఎంత? ఒక్కసారి గమనిస్తే…
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ పనిచేసేదే టార్గెట్ కేసీఆర్. కాబట్టి యుద్ధం చేసే వ్యక్తికి కత్తి అందించినట్లే అవుతుంది. కాబట్టి కేసీఆర్ కనుసన్నల్లో నడిచే ఏసీబీ ద్వారా కేసు తెరపైకి వచ్చేసింది. రేవంత్ రెడ్డి డ్యామేజ్ కావాలి కాబట్టి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండే విధంగా జాగ్రత్తపడుతున్నారు. కానీ ఈడీ తెరపైకి రావటమే రాజకీయ క్రీడను భయటపెడుతుంది. సహాజంగా బీజేపీ తల్చుకుంటే కాని ఈడీ తెరపైకి రాదు. ఇక్కడ మాత్రం బీజేపీ రెండు అంశాలను బేరీజు వేసుకున్నట్లు కనపడుతుంది. ఒకటి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే ప్రత్యామ్నాయంగా ఎదగలనుకున్న బీజేపీ ఆశ నెరవేరదు. రెండు కాంగ్రెస్ నేతల్లో కుమ్ములాటలు కొనసాగాలనే కోరుకుంటుంది. అందుకే పీసీసీ రేసులో ఉన్న ఓ నేత చక్రం తిప్పటంతో బీజేపీ పని చేసి పెట్టింది. సదరు కాంగ్రెస్ నేత స్వయంగా మత్తయ్యను కలిశారు. అమ్యామ్యాలు ఇచ్చేసి.. రేవంత్ పేరును చెప్పేలా వ్యూహాం రచించారు. అదే సమయంలో ఈడీని ఎంటర్ చేసేందుకు బీజేపీతో గేమ్ నడిపించాడు. ఫలితమే 2015లో నమోదైన ఓటుకు నోటు కేసులో ఇప్పుడు మత్తయ్యను స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఈడీ పిలవటం. సహజంగా ఈడీ ఎంటర్ అయ్యిందంటే మనీలాండరింగ్ జరగాలి. ఏసీబీ విచారణలో ఎక్కడా అది ప్రూవ్ కాలేదు. పైగా ఈడీకి మత్తయ్య ఏం స్టేట్మెంట్ ఇచ్చారన్నది అక్షరం పొల్లు పోకుండా ప్రచారం చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసే గుణం ఉన్న మత్తయ్యకు రేవంత్ భయపడి ఆఫర్ చేస్తే ఇంత దూరం వచ్చేదా…? అన్న కనీస ఆలోచన చాలా మంది చేయటం లేదు.
కానీ రేవంత్ అనే ఒక్కన్ని కొట్టడానికి కాంగ్రెస్ లోనే ఓ గ్రూప్ ఇంటి దొంగగా పనిచేస్తుంటే… ఏకు మేకవుతాడన్న భయంతో కేసీఆర్ ఏసీబీని వాడుతున్నారు. ఈ మొత్తం ఇష్యూలో బీజేపీకి అవకాశం రాదేమోనన్న భయంతో కాంగ్రెస్ ఇంటి దొంగలతో కలిసి బీజేపీ ఈడీని ఉసిగొల్పినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.