ఐపీఎల్ అంటేనే క్రికెట్ ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అయితే.. ఐపీఎల్ సీజన్ 2022 లో మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన 15 సీజన్లకు గానూ ఈ సారి అత్యధిక సిక్స్ లు బాదారు బ్యాటర్లు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో.. ఈ సీజన్ లో 1000 వ సిక్సర్ ను నమోదు చేశాడు పంజాబ్ బ్యాట్స్ మెన్ లియామ్ లివింగ్ స్టోన్.
మహారాష్ట్ర వేదికగా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. ఆదివారంతో లీగ్ దశ ముగియడంతో.. ప్లేఆఫ్స్ కు ముహుర్తం దగ్గరపడింది. కాగా.. ఈ సీజన్ లో ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని ఓ అరుదైన ఘనత చోటు చేసుకుంది. ఐపీఎల్-15 లో తొలిసారి వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి. హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్ లో పీబీకేఎస్ బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ సిక్సర్ బాదడంతో ఈ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదయ్యాయి.
ఒక ఐపీఎల్ సీజన్ లో వెయ్యి సిక్సర్లు నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతంలో 2018 లో అత్యధికంగా 872 సిక్సర్లు నమోదయ్యాయి. ఆ రికార్డును ఐపీఎల్-15 బ్రేక్ చేసింది. ఐపీఎల్-15 లో ఇప్పటికి లీగ్ దశ ముగియగా ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ లు.. మొత్తంగా ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగు మ్యాచ్ ల్లో మరో వంద సిక్సర్లు కూడా నమోదయ్యే అవకాశముందంటున్నారు క్రికెట్ పెద్దలు.
ఇక పంజాబ్-హైదరాబాద్ మధ్య ముగిసిన మ్యాచ్ లో 22 బంతుల్లో 49 పరుగులు సాధించిన లివింగ్ స్టోన్.. తన ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘కొంతమంది గత కొంతకాలంగా నా బ్యాటింగ్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. వారిని తప్పు అని ప్రూవ్ చేయడానికి నాకు ఈ సీజన్ ఎంతగానో ఉపయోగపడింది..’ అని విమర్శకులకు గట్టి సమాధానమిచ్చాడు. ఈ సీజన్ లో లివింగ్ స్టోన్ 14 మ్యాచులలో 437 పరుగులు సాధించాడు. కాగా.. 1000 వ సిక్సర్ తన బ్యాట్ నుండి రావడం ఆనందంగా ఉందని అన్నారు లివింగ్ స్టోన్.
ఏ సీజన్ లో ఎన్ని సిక్సర్లంటే..
సీజన్ సిక్సర్లు
2022 1001
2018 878
2019 784
2020 734
2012 731