ఒడిశాలో వరుసగా రష్యన్ ప్రముఖుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రష్యన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇటీవల రాష్ట్రంలో ఇద్దరు రష్యా ప్రముఖులు మరణించారు. ఆ ఘటన మరవక ముందే మరో రష్యన్ మరణించడం కలకలం రేపుతోంది.
పారాదీప్ పోర్టులో లంగర్ వేసి ఉన్న ఓ షిప్‌లో అతని మృత దేహాన్ని గుర్తించారు. అతన్ని మిల్యాకోవ్ సెర్గీ(51)గా పోలీసులు గుర్తించారు. ఆయన ఎమ్బీ అల్ద్నాఅనే నౌకకు చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నౌక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టు నుంచి పారాదీప్ పోర్టు మీదుగా ముంబైకి వెళుతున్నట్టు తెలుస్తోంది.
రష్యన్ ఇంజినీర్ మరణ వార్తను పారాదీప్ పోర్టు ట్రస్టు ఛైర్మన్ పీఎల్ హరనంద్ ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరుగుతోందని వివరించారు. 15 రోజుల వ్యవధిలో ఇది ముగ్గురు రష్యన్ పౌరులు మరణించడం కలకలం రేపుతోంది.
గత నెలలో రష్యాకు చెందిన ఇద్దరు పర్యాటకులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. రష్యా చట్టసభ్యుడు పావెల్ ఆంటోవ్ హోటల్ మూడవ అంతస్తు నుంచి కిందకు పడిపోవడంతో మరణించారు. గత నెల 24న మరో రష్యా పౌరుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61) హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
ఆ ఇద్దరు రష్యన్ పౌరుల మరణాలపై దర్యాప్తులో రోజుకో కీలక విషయం బయటకు వస్తోంది. వీరిద్దరి పోస్టుమార్టం నివేదికను ఆధారంగా తీసుకుని పోలీసులు కొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బిదెనోవ్ మృతదేహంలో గంజాయి వాసనతో కూడిన 100 మి.లీ. ద్రవ పదార్థం ఉన్నట్టు పోస్టు మార్టమ్ నివేదికలో తేలింది.
ఈ క్రమంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌లో బస చేసిన రష్యన్ పర్యాటకులకు గంజాయి ఎవరు సరఫరా చేశారు అనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ మేరకు హోటల్ సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు.
మరోవైపు దీనిపై దర్యాప్తు వివరాలను నాలుగు వారాల్లో సమర్పించాల్సిందిగా పోలీసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఆదేశించింది.ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. రష్యన్ ప్రముఖుల మృతిపై బ్రహ్మపురానికి చెందిన రబీంద్ర మిశ్ర అనే మానవ హక్కుల కార్యకర్త వేసిన పిటిషన్ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
పోలీసులు విచారణను వేగవతం చేశారు. డీఎస్పీ సరోజ్‌కాంత్ మొహంతో నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. మొత్తం పన్నెండు మందితో కూడిన క్రైంబ్రాంచ్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.
సరోజ్‌కాంత్, ఇన్‌స్పెక్టర్ మమతారాణి పండాతో కూడిన అధికారుల బృందం హోటల్‌లో మేనేజ్‌మెంట్, సిబ్బందిని విచారిస్తోంది.