ఎప్పుడూ ఏదోక వివాదాలతో విజయవాడ అమ్మవారి గుడి వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా అమ్మవారి పుణ్యక్షేత్రంలో మరో అపచారం జరిగింది. ఇటీవల ఓ మహిళా భక్తురాలు కొండపైకి దర్శనానికి వచ్చి ఏకంగా గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్ ను సెల్ లో తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఘటన మర్చిపోకముందే మరో అపచారం చోటు చేసుకుంది.
ఇంద్రకీలాద్రిపై నటరాజ స్వామి ఆలయం వెనుక ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని బలిహారణ పీఠంపై అనధికార అర్చకులు ఎంగిలి నీళ్లు పోశారు. దీన్ని గమనించి ప్రశ్నించిన భక్తులపై దురుసుగా మాట్లాడుతూ అది తప్పు కాదంటూ బుకాయించారు. దీంతో వారు ఈవో భ్రమరాంభకు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ పిలిపించి విచారణ చేయగా వారు అసలు ఆలయానికి సంబంధం లేని వ్యక్తులుగా ఈవో గుర్తించారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన అర్చకుడు గణేష్.. తాను మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళుతూ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం, వీరంకిలాకులు ప్రాంతానికి చెందిన కనుపూరి సుబ్రహ్మణ్యంను విధుల్లో పెట్టారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న నాగేంద్రస్వామి ఆలయంలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఆలయానికి సంబంధంలేని యనమంద్ర కృష్ణ కిషోర్ అనే వ్యక్తిని కూడా గుర్తించి తీవ్రంగా హెచ్చరించారు.
ఈ విషయం పై చర్యలు తీసుకుంటానని ఫిర్యాదు చేసిన భక్తులకు ఈవో హామీ ఇస్తూ.. అనధికార వ్యక్తులతో పాటు ఆలయ ఉద్యోగి గణేష్ నుంచి వివరణ పత్రం వ్రాయించుకున్నారు. విధులు ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎవరికి ఎవరు డ్యూటీ వేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని, వైదిక కమిటీ లిస్టును కూడా ఇవ్వాలని ఈవో భ్రమరాంభ అధికారులను ఆదేశించారు.