దేశంలోని వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పై మళ్లీ రాళ్ల దాడి జరిగింది. వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 30 వ తేదీన ప్రారంభించారు. అనంతరం నాలుగు రోజులకే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా వద్ద కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు.
మాల్దా వద్ద ఉన్న కుమార్ గంజ్ స్టేషన్ వద్ద వందేభారత్ రైలుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. హౌరా న్యూజల్పాయిగురి మధ్య నడిచే ఈ రైలు పై రాళ్లు విసరడంతో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాళ్ల దాడితో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారు.
ఈ రాళ్ల దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదని రైల్లే పోలీసులు చెప్పారు. కుమార్ గంజ్ రైల్వేస్టేషన్ బయట నుంచి రైలుపై ఆగంతకులు రాళ్లు వేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దుండగులు రాళ్లు విసిరారని, అద్దాలు పగిలినట్లు ఓ ప్యాసింజర్ వెల్లడించాడు. అయితే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వీటిలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
వర్చువల్ గా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మొత్తం 564 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. బర్సోయ్, బోల్పూర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది. ఇందులో మొత్తం 16 బోగీలుంటాయి. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు.