– ఒత్తిళ్లకు తాళలేక తరగతి గదిలోనే బలవన్మరణం
– కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పేరెంట్స్
– విద్యార్థి సంఘాల ఆగ్రహ జ్వాల
– విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
– కేసు నమోదు.. పలువురి అరెస్ట్
చదువు చెప్పాల్సిన టీచర్లు యమకింకరులుగా మారుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు విద్యార్థులను రాచిరంపాన పెడుతున్నాయి. ఈక్రమంలోనే స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీచైతన్య వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. నార్సింగి బ్రాంచ్ లో ఇంటర్ చదువుతున్న ఎన్ సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల తర్వాత తరగతి గదిలోనే ఉరి వేసుకున్నాడు. కళాశాలలో ఒత్తిళ్ల నేపథ్యంలో సాత్విక్ ప్రాణాలు విడిచాడని తోటి విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. కనీసం సిబ్బంది అతన్ని ఆస్పత్రికి కూడా తీసుకు వెళ్లలేదని చెబుతున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన
ఎంతో భవిష్యత్ ఉన్న తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో సాత్విక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ అర్థాంతరంగా తనువు చాలించాడని అంటున్నారు. చదువు కోసం వస్తే చంపేస్తారా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసుల కాళ్లపై సాత్విక్ సోదరుడు పడి వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.
సూసైడ్ లెటర్ వెలుగులోకి!
సాత్విక్ సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. అందులో శ్రీచైతన్య కాలేజీ ప్రిన్సిపాల్, ఇంఛార్జ్, లెక్చరర్స్ పేర్లను ప్రస్తావించాడు. వారి టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ తనను వేధింపులకు గురిచేసినట్లు లేఖలో తెలిపాడు. వీరందరూ ఏకమై హాస్టల్ లో చదివే విద్యార్థులను టార్చర్ పెడుతున్నారని వాపోయాడు. ఈ వేధింపులకు తాను తాళలేక పోయానన్నాడు. అమ్మా.. నాన్నా.. క్షమించండి అంటూ లేఖలో తన బాధను వివరించాడు.
విద్యార్థి సంఘాల ఆందోళనలు
సాత్విక్ మృతి నేపథ్యంలో శ్రీచైతన్య కళాశాలపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని, కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాల నాయకులు. దీంతో పోలీసులు అరెస్టులకు దిగారు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు కళాశాల ముందు బైఠాయించి న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు.
విచారణకు విద్యాశాఖ ఆదేశం
సాత్విక్ ఆత్మహత్య బాధాకరమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సూసైడ్ ఘటన తెలియగానే తాను ఆవేదన చెందానని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆమె ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు స్పష్టం చేశారు.
పోలీసుల కేసు నమోదు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాల సిబ్బందిపై ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసు పెట్టారు. వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణా రెడ్డి, వార్డెన్ నరేష్ తో పాటు మేనేజ్ మెంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద కేసు పెట్టినట్టు వెల్లడించారు.