జీవో నెం. 317 ఉద్యోగుల పాలిట యమపాశంలా మారింది. తాజాగా మరో ఉపాధ్యాయుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన ఉప్పుల రమేష్ ఖానాపురం మండలం ధర్మారావుపేట దగ్గర బాలు తండాలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తాజాగా బదిలీ ప్రక్రియలో భాగంగా ఆయన ములుగు జిల్లా మల్లంపల్లికి వెళ్లాల్సి వచ్చింది.
కుటుంబాన్ని వదలి అక్కడికి వెళ్లడం రమేష్ కి ఇబ్బందిగా మారింది. ఆరోగ్యం కూడా సహకరించలేదు. దీంతో.. మనస్థాపానికి గురైన రమేష్ సోమవారం స్కూల్ దగ్గరే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో రమేష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై మాట్లాడిన బాధిత కుటుంబ సభ్యులు.. ఈ బదిలీ ప్రక్రియే రమేష్ ప్రాణాలను హరించిందని ఆరోపిస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్యంతో కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లాలనే ఆలోచనతో రమేష్ లోలోపల కుమిలిపోయాడని స్థానికులు చెబుతున్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. జీవో నెం. 317 రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఈ జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.