కేరళలో వెలుగు చూసిన గోల్డ్ స్కామ్ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ చేత బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారన్న అభియోగాలపై ఈ కేసు నమోదు చేశారు.
గోల్డ్ స్కాంలో హవాలా కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ప్రశ్నించారని… ఇందులో దురుద్దేశంతోనే సీఎం పేరును చెప్పించారని, బెదిరించారని క్రైం బ్రాంచ్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ లో నమోదు చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రేరేపించారన్న అభియోగాలను ఈడీ అధికారులపై మోపారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్న చెప్పినట్లు ఓ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. కొందరు మహిళా పోలీసులు కూడా ఈడీకి వ్యతిరేకంగా ఇచ్చిన స్టెట్మెంట్లను క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టు ముందు ఉంచారు.