వరంగల్ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ప్రీతి కావాలనే ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా ఆమెను కావాలనే హత్య చేశారా అనే అనుమానాలున్నాయంటూ ఓయూ జేఏసీ వెల్లడించింది. ఈ విషయం గురించి మానవ హక్కుల కమిషన్ ని ఓయూ జేఏసీ సోమవారం ఆశ్రయించింది.
ఈ విషయం పై ఓయూ జేఏసీ పిటిషన్ దాఖలు చేసింది. అంతే కాకుండా ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. నిమ్స్, గాంధీ ఆస్పత్రి లో పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ చేయాలని హెచ్‌ఆర్‌సీని ఓయూ జేఏసీ కోరింది.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ మాట్లాడుతూ..మెడికో విద్యార్థిని ప్రీతి మృతిపై మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రీతి కుటుంబాన్ని డీసీపీ జోయల్ డెవిస్ తీవ్రంగా ఇబ్బందులు పెట్టారన్నారు. గాంధీ లో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను అనుమతించలేదని తెలిపారు.
ప్రీతి మృతదేహానికి సీనియర్ డాక్టర్స్ చేత పోస్టుమార్టం చేయించలేదన్నారు. జూనియర్ డాక్టర్స్ చేత పోస్టుమార్టం చేయించారని మండిపడ్డారు. ఉగ్రవాదుల మాదిరిగా పోలీసులు వ్యవహారించారని అన్నారు. ప్రీతిని తరలిస్తున్న అంబులెన్స్‌లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప్పల్‌లో తన నివాసంలో ఆపాలని కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ప్రీతి మృతిఫై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు.