కాంగ్రెస్ అనగానే గుర్తొచ్చేది గ్రూపులు. గ్రూపులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన కాంగ్రెస్ లో… పదవుల అంశం వస్తే చాలు గ్రూపులు కట్టేస్తారన్న అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు పాదయాత్రలకు కూడా ఎవరికి వారు పోటీ పడుతున్నారు. పాదయాత్రలతో పదవులు వస్తాయన్న నమ్మకమో… ఎక్కడ తాము వెనకబడతామన్న భయమో కానీ కాంగ్రెస్ నేతలు పాదయాత్రలకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తూ జనంలో ఉండగా… వెంటనే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అదిలాబాద్ నుండి రైతుల కోసం బయల్దేరారు. ఈ ఇద్దరి యాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఇద్దరు నేతలు పాదయాత్ర సై అంటున్నారు. ఈ నెల 19నుండి ఎంపీ కోమటిరెడ్డి ప్రాజెక్టుల యాత్ర చేయనున్నారు. బ్రహ్మణవెల్లంల నుండి ఈ పాదయాత్ర మొదలవుతుంది. పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించటం, మధ్యలో రైతులతో ముచ్చటించటం యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ యాత్రను పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డిలు ప్రారంభించనున్నారు.
ఇక తాను కూడా పీసీసీ రేస్ లో ఉన్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈనెల 22 నుండి వారం రోజుల పాటు జగ్గారెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట నుండి మొదలయ్యే ఈ యాత్ర హైదరాబాద్ లోని గన్ పార్క్ వరకు చేయాలని నిర్ణయించారు.
రాబోయే రోజుల్లో ఇంకెవరు మేము కూడా యాత్ర చేస్తున్నాం అని బయల్దేరుతారో చూడాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి.