కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ధాన్యం కొనదంటూ గతంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రభుత్వం వ్యాపారి కాదని, ధాన్యం కొనటం వల్ల 7500కోట్లు నష్టం వచ్చిందని… ఇది రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర భారం పడుతుందంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నుండి మద్ధతు ధరతో ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనలేమని తేల్చి చెప్పారు.
దీనిపై ప్రతిపక్షాలు, రైతుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వ్యాపారి కాదంటూ… ఓ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటించిందని, దీనిపై పోరాటం చేస్తామని… రైతుల పక్షాన నిలబడతామంటూ హెచ్చరించారు. యాసంగి పంట వచ్చే సమయంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.
వరుస ఓటములు, రైతుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. ధాన్యం ప్రభుత్వమే కొంటుందని, 80లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, రైతులు మేలురకం ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకరావాలని, మద్ధతు ధర చెల్లించి పాత పద్ధతిలోనే ధాన్యం కొంటామని ప్రకటించారు.