పేద కుటుంబం.. కానీ.. డిగ్రీ వరకు చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని ఎంతో శిక్షణ పొందాడు. కుటుంబసభ్యులను గొప్పగా చూసుకోవాలని ఆశపడ్డాడు. కానీ.. నోటిఫికేషన్ల జాడ లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్ ఖమ్మంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్‌సీసీ శిక్షణ పొందాడు. మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే ప్రభుత్వం ఎంతకీ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ‘ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తుంది.. నా చావుకు కరోనా, సీఎం కేసీఆరే కారణం’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం మామిళ్ల గూడెం సమీపంలోని రైల్వే ట్రాక్ పై సాగర్ శవాన్ని గుర్తించారు. మృతుడి తల నుంచి మొండెం వేరుపడి ఉండగా రైల్వే పోలీసులు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాధిత ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
మృతుడి తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడు ఎంతో కష్టపడి చదువుకున్నాడని తెలిపాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాగర్ మృతదేహాన్ని పలువురు నాయకులు సందర్శించి తల్లిదండ్రులను పరామర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడని మార్చురీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. అలాగే ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే.. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.