ఛత్తీస్ గఢ్ ఏజెన్సీలో మరో సారి మావోయిస్టుల కలకలం రేగింది. తాజాగా వారు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ధనోరా ప్రాంతానికి చెందిన కుడియం అర్జున్ అనే యువకున్ని మావోయిస్టులు గురువారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు. గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు.
తర్వాత అతని మృతదేహాన్ని గ్రామ సమీపంలో నడిరోడ్డుపై పడేశారు దుండగులు. గంగులూరు ఏరియా కమిటీ పేరుతో ఘటనా స్థలంలో కరపత్రాలను వదిలివెళ్లారు మావోయిస్టులు.
అతను పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్న కారణంగానే హత్య చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.