కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మంత్రి రమేష్ జార్ఖిహోళీ వ్యవహరం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే మూడు సిడీలను బయటకు వదిలగా… ఇప్పుడు నాలుగో సిడీని కూడా ఆ బాధిత యువతి విడుదల చేసింది. తను బ్రతకాలా… చావాలో కూడా అర్థం కావటం లేదని… రమేష్ జార్ఖిహోళీ పేరు రాసి చనిపోవాలనిపిస్తుందని వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో ఆ యువతి తల్లితండ్రులు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యవహారం మొత్తం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వెనుకుండి నడిపిస్తున్నారని సీడీలోని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.
దీనిపై సదరు యువతి కీలక వ్యాఖ్యలు చేసింది. సీడీ బయటకు వచ్చిన వెంటనే తనకు పరిచయం ఉన్న నరేశ్‌ను కలవడంతో దీనికి రాజకీయ నాయకుల మద్దతు అవసరమని ఆయనే చెప్పారని… ఆయన సాయంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను కలవడానికి ప్రయత్నించినట్టు పేర్కొంది. కేవలం భద్రత కోసమే వారి వద్దకు వెళ్లానని, వారిని కలవలేదని వివరించింది.
తనతోపాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని గత 24 రోజులుగా అభ్యర్థిస్తున్నానని… తాను ఏం మాట్లాడినా వివాదంగా మారుస్తున్నారని… త్వరలోనే తాను అధికారులను కలిసి అన్ని విషయాలను వెల్లడిస్తానని వీడియో విడుదల చేసింది.