కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసాన్ని మరవకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. తాజాగా.. మంకీపాక్స్ అనే మరో కొత్త వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ఇప్పటివరకు 19 దేశాలకు విస్తరించింది.
ఇన్నాళ్లు యూరప్ ప్రాంతానికే పరిమితం అయిన మంకీపాక్స్ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించారు. ప్రస్తుతం యూఎస్ఏలో ఏడు రాష్ట్రాల్లో మొత్తం 9 మంకీపాక్స్ కేసులను గుర్తించారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మసాచుసెట్స్, న్యూయార్క్, ఉటా, వర్జీనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కేసులను గుర్తించారు. కాగా ఈ తొమ్మిది మంది కూడా ఇటీవల వివిధ దేశాలకు వెళ్లి వచ్చినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. రాబోయే రోజుల్లో అమెరికాలో మరిన్ని కేేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే.. ఈ వ్యాధి విస్తరించకుండా ఉండేందుకు సీడీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే.. మంకీపాక్స్ రిస్క్ తక్కువగానే ఉందని.. వైరస్ మరింత వ్యాప్తి చెందడానికి ఎటువంటి ఆధారాలు లేవని.. టీకాలు వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ.. మరికొన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రపంచంలోని 20 దేశాల్లో 200పైగా కేసులను ధ్రువీకరించగా.. మరో 100 మంది అనుమానిత కేసులు బయటపడ్డాయి. ఆఫ్రికా దేశాలైన కామోరూన్, కాంగో, నైజీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాల్లో సాధారణంగా కనిపించే మంకీపాక్స్ ప్రస్తుతం బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, చెక్ రిపబ్లక్, యూఏఈ, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో బయటపడింది.