సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు రక్తం చిందిస్తూనే ఉన్నాయి. అపశృతులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా తిరుపత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాట్రపల్లిలో నిన్న నిర్వహించిన జల్లికట్టులో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే ఆ యువకుడు మృతికి పోలీసులే కారణం అంటూ ఆరోపిస్తున్న గ్రామస్తులు.. పోలీసులపై దాడికి తెగబడ్డారు. గ్రామస్తుల దాడిలో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులైన పోలీసులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు నాట్రపల్లిలో భారీగా మోహరించారు పోలీసులు. ఇవాళ గ్రామంలో జరగాల్సిన జల్లికట్టును రద్దు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.కాగా, జల్లికట్టులో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులో నలుగురు, కర్ణాటకలో ఇద్దరు మరణించారు. తమిళనాడులోని పాలమేడుకు చెందిన అరవింద్ రాజ్..జల్లికట్టులో భాగంగా ఎద్దుతో తలపడ్డాడు. ఎద్దు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన అరవింద్ రాజ్ కు స్థానిక పీహెచ్ సీ లో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని రాజాజీ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అసలు ఈ జల్లికట్టు అనేది ఒక ప్రమాదకరమైన సాంప్రదాయ క్రీడ. ఇక్కడ శక్తిమంతమైన యువకులు బలమైన ఎద్దులపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మరో వైపు జల్లికట్టులో జరిగిన ఈ ఘటనలపై ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ పోటీల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఆయన మృతుల కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.