ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఆయనొక్కడే ఆ పార్టీకి ఎమ్మెల్యే. ఆయన కూడా హ్యండిచ్చేశారు. అయినా బాస్ యాక్షన్ తీసుకోలేదు. కాని ఇప్పుడు టైమ్ వచ్చింది. అవకాశం దొరికింది. అంతే ఎలా తొక్కాలో అలా తొక్కుతున్నారు. ఎలా నొక్కాలో.. అలా నొక్కుతున్నారు. దీంతో నోరు పెగలటం లేదు.. అంతకు ముందు జోకులు వేసిన నోరుని కట్టేసుకున్నారు. నేను మొదటి నుంచీ అధికారపార్టీ వైసీపీనే అని చెప్పుకున్న పెద్దమనిషి.. ఇప్పుడు ఏమనాలో అర్ధం కాక.. సైలెంట్ అయిపోయారు. తన నియోజకవర్గంలోనే ఇంత అలజడి రేగుతున్నా .. ఎవరికీ కనపడకుండా.. దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆయన జెండా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచేశారు. దీంతో అందరూ షాకయ్యారు. సీఎం నవ్వుకున్నారు. పవన్ కల్యాణ్ ఏమనుకున్నారో తెలియదు. కాని తర్వాత సందర్భం దొరికినప్పుడల్లా రాపాక.. జనసేనపై సెటైర్లు వేయడం.. అయినా జనసేన మౌనంగానే ఉండటం చూశాం. కొన్నిసార్లు ఆయనను సస్పెండ్ చేసినట్లు లెటర్లు కూడా వాట్సప్ గ్రూపుల్లో తిరిగాయి. తర్వాత జనసేన ఆఫీసు నుంచి అలాంటిదేమీ లేదని క్లారిటీ కూడా వచ్చింది. ఇంత బహిరంగంగా హ్యాండిచ్చినా.. ఇంకా రాపాకపై వేటు ఎందుకు వేయడం లేదని.. పవన్ పై విమర్శలు కూడా వచ్చాయి. అయినా స్పందించలేదు.
ఇప్పుడు అంతర్వేది ఘటన జరిగిన నియోజకవర్గం రాజోలు. ఆ రాజోలుకే ఈ రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యే. ఆయన దళితుడు.. ఆయనకు జనసేనకు చెందిన వర్గాల ఓట్లు తోడవటంతో.. ఆయన గెలవగలిగారు. కాని ఆయన మాత్రం తను వైసీపీ అని.. ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు కాబట్టి.. జనసేన తరపున పోటీ చేశానే తప్ప.. పవన్ కల్యాణ్ వల్లో.. జనసేన వల్లో తాను గెలవలేదని.. ప్రకటన చేశారు. దీనిపై జనసైనికులు ఆగ్రహం చెందారు కూడా. సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు.
అంతర్వేది ఘటన వెనక వైసీపీలోని రెండు వర్గాల మధ్య పోరు కారణమనే ప్రచారం జరుగుతోంది. అందులో ఒక వర్గంలోని వాడు రాపాక.. . పైగా ఆ వర్గమే రధాన్ని దగ్ధం చేయించింది అని ఆరోపణలు వస్తున్నాయి కూడా. దీంతో అంతర్వేది అసలు నిజాలు బయటపెట్టాలంటూ జరుగుతున్న ఆందోళనలో జనసైనికులు మొత్తం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న జనసైనికులకు వరప్రసాద్ ఇప్పుడు దొరికాడు. అందుకే ఎక్కడా తగ్గకుండా.. అంతర్వేది ఉద్యమంలోకి జనసైనికులు దూకారు.
మాజీ ఎంపీ హర్షకుమార్ సైతం.. జనసేన ఇంత ఆందోళన చేయడానికి కారణం.. ఎమ్మెల్యే వరప్రసాద్ ను ఇరుకున పెట్టడానికేనని ఆరోపణ చేశారు. బిజెపి, జనసేన ఇద్దరూ కలిసి ఒక అవగాహనకే వచ్చి ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. అయితే.. వరప్రసాద్ అందులో ఇరుక్కోవడం అనేది.. అలా కలిసొచ్చిందంతే. ఇక నియోజకవర్గంలో తిరగడం రాపాకకు కష్టమే అని చెప్పుకోవాలి. ఈ అంతర్వేది గొడవలో.. రాపాకను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.