దేశాన్ని బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పార్టీ పని ఆయన మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్బావ సభలో ఆయన పాల్గొన్నారు.
దేశంలో బీజేపీ వ్యతిరేక పోరాటానికి ఖమ్మం జిల్లాలో అడుగులు పడ్డాయని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి భారత్ లోనే ఉందని పేర్కొన్నారు. కానీ ఈ దేశంలో యువకులకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదని ఆయన మండిపడ్డారు.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావడమే బీజేపీ సూత్రమన్నారు.
సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదన్నారు. ఒక్కో సారి రాజు బికారి అవుతాడని, బికారి రాజు అవుతాడని ఆయన బీజేపీని హెచ్చరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమన్నారు. తాము కూడా పంజాబ్‌లో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.
దేశం అనే పుష్ప గుచ్ఛంలో అన్ని రకాల పువ్వులు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ కొందరు మాత్రం ఒకే పువ్వును కోరుకుంటున్నారని ఆయన బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ అకౌంట్‌లో పది లక్షల రూపాయాలు వేస్తామని మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు. మరి ఎంత మంది అకౌంట్లలో డబ్బులు వేశారని ఆయన ప్రశ్నించారు.
దేశంలో ప్రజాస్వామ్యం నడవడం లేదన్నారు. కేవలం దోపిడీ రాజ్యం నడుస్తోందన్నారు. దేశాన్ని అమ్మివేస్తున్నారంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.