భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో దొంగచాటుగా ప్రవేశిస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధపడింది. ముఖ్యంగా జమ్మూ-పంజాబ్ సెక్టార్ లో యాంటీ డ్రోన్ జామర్లను, డ్రోన్లను నిర్వీర్యం చేసే స్పూఫర్లను ఈ ఏడాది రంగంలోకి దించారు. పాక్ లోని ఉగ్రవాద బృందాలు మాదకద్రవ్యాలను, ఆయుధాలు, పేలుడు పదార్థాలను డ్రోన్ల ద్వారా ఈ సెక్టార్ లో జారవిడుస్తున్న తీరును భారత సైన్యం తీవ్రంగా పరిగణించింది.
దేశీయంగా తయారు చేసిన యాంటీ డ్రోన్ జామర్ సిస్టమ్స్ ను పరీక్షించినప్పుడు ఇవి సంతృప్తికరమైన ఫలితాలనిచ్చాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. తాము 30 స్పూఫర్, జామర్ సిస్టమ్స్ ను జమ్మూ పంజాబ్ సెక్టార్ లో పశ్చిమ బోర్డర్ పొడవునా మోహరించినప్పుడు వీటి పనితీరు అద్భుతంగా ఉందని వెల్లడించాయి.
మూడు నెలలుగా వీటిని పరీక్షించినట్టు పేర్కొన్నాయి. ఇవి బోర్డర్స్ నుంచి పాక్ డ్రోన్లు రాకుండా నిరోధించాయని స్పష్టం చేశాయి. ఓ డ్రోన్ అక్రమంగా ప్రవేశిస్తున్నదంటే.. స్పూఫర్ సిస్టమ్స్, దానికి తప్పుడు సంకేతం పంపి.. దాని కమ్యూనికేషన్ లింక్ ని తప్పుదారి పట్టిస్తాయి. జామర్.. డ్రోన్ ని ఆపరేట్ చేసేందుకు వినియోగించే రేడియో ఫ్రీక్వెన్సీని అడ్డగిస్తుంది.
దీంతో సదరు డ్రోన్ నిర్వీర్యమై కింద పడిపోతుంది. గత ఏడాది పంజాబ్, రాజస్థాన్, జమ్మూ వరకు వివిధ చోట్ల పాక్ ఉగ్రవాద బృందాలు ప్రయోగించిన సుమారు 300 డ్రోన్లను కనుగొన్నారు. గత మూడేళ్ళుగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి టెర్రరిస్టు సంస్థలు సియాల్ కోట్ సెక్టార్ లోని తమ లాంచ్ పాడ్స్ నుంచి పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లను ప్రయోగించాయి. రోజురోజుకీ వీటి బెడద తీవ్రం కావడంతో ఇండియన్ ఆర్మీ యాంటీ డ్రోన్ జామర్ సిస్టమ్స్ ని సరిహద్దుల్లో మోహరిస్తోంది.