హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడికి పోతోంది. మహసా అమినీ మరణం తర్వాత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు నిరసనల్లో సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బ్రిగేడియర్ జనరల్ అమిరాలి హజిజాదే వెల్లడించారు.
దేశంలోని ప్రతి ఒక్కరిపైనా అమాసా మరణం తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. మృతుల్లో సైనికులు, పోలీసులు, మిలిషియా సభ్యులు ఉన్నట్లు ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో మహసా అమీని అనే యువతి మృతి చెందారు.
దీంతో ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అమాసా హిజాబ్ సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అక్కడ వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్ 17న పెద్ద నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనలు క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకు పాకాయి. నిరసన ప్రదర్శనలను అల్లర్లుగా ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు నిరసనలను ఎక్కడికక్కడ అణిచి వేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.