భారత వ్యతిరేక శక్తులు సుప్రీంకోర్టును ఓ సాధనంగా వినియోగించుకుంటున్నాయని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ ‘సర్వే’ లు జరగడానికి ఒకరోజు ముందు .. ఈ సంస్థ తన ‘పాంచజన్య’ పత్రికలో రాసిన సంపాదకీయంలో ఈ ఆరోపణ చేసింది ఎడిటర్ హితేష్ శంకర్ రాసిన ఈ ఎడిటోరియల్.. ఇటీవలి పరిణామాలను సమగ్రంగా విశ్లేషించింది. ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పురస్కరించుకుని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసును జారీ చేయడాన్ని ఈ ఎడిటోరియల్ విమర్శించింది.
ఇండియాను వ్యతిరేకిస్తున్న శక్తులు ..సుప్రీంకోర్టును తమ స్వప్రయోజనాలకోసం ఓ సాధనంగా వినియోగించుకుంటున్నారని దుయ్యబట్టింది. ఈ దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటయిందని, కానీ ఈ శక్తులు దీన్ని ఇలా ఉపయోగించుకోవడం హేయమని అభిప్రాయపడింది. ‘అవాస్తవికాలు, ఊహాజనితాలను ఆధారంగా చేసుకుని బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించారు. ఇండియా ప్రతిష్టను దెబ్బ తీయడానికి దీన్ని తీశారు’ అని హితేష్ శంకర్ ఆరోపించారు.
సుప్రీంకోర్టు ఇండియాకు చెందినదని, భారతీయులు చెల్లించే పన్నులపై ఈ దేశం నడుస్తోందని పేర్కొన్న ఆయన.. ఈ దేశ ప్రయోజనాలకోసం రూపొందిన చట్టాలు, శాసనాల ప్రకారం అత్యున్నత న్యాయస్థానం తన బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుందని అన్నారు. కానీ దీన్ని భారత వ్యతిరేక శక్తులు తమకు అనుకూల సాధనంగా ఉపయోగించుకుంటున్నాయన్నారు.
మానవ హక్కుల పేరిట ఉగ్రవాదులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. పర్యావరణం పేరిట భారత పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నారు అని ఈ సంపాదకీయం పేర్కొంది. వీటి చేతిలో ఈ దేశం బలహీనపడకుండా చూడవలసిన బాధ్యత భారతీయులపై ఉందని హితేష్ శంకర్ హెచ్చరించారు.