పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది. తమ ప్రాంతాలపై వివక్షత చూపిస్తున్నారంటూ పీఓకే, బాల్టిస్తాన్‌లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని దోపిడీ చేసి పంజాబ్, సింధ్ ప్రజలకు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
ఈ మేరకు పాక్ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే భారత్‌లో కలుస్తామంటూ నినదిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి.పాక్‌లో ప్రజలు గోధుమాల కోసం కొట్టుకు చస్తున్నారు. పాక్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంది. అదే గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది.
ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్‌తో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతున్నారు.