కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కరోనా మొదటి వేవ్ లో కాస్త భయపెట్టినప్పటికీ.. ప్రాణ నష్టం తక్కువగానే ఏర్పడింది. కానీ.. కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా రూపంలో కాస్త ఎక్కువగానే ప్రాణ నష్టాన్ని మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు కరోనా థర్డ వేవ్ ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని రూపంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసినప్పటికీ.. అంతగా ప్రాణాంతకంగా ఏం కనించలేదని నిపుణులు వెల్లడించారు.
కరోనా వైరస్ ను వ్యాక్సిన్ లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్ ల నుంచి పొందిన యాంటీబాడీలు కొన్ని నెలలకే క్షీణిస్తాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత కూడా కొవిడ్-19కు కారణమయ్యే వైరస్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. వాటి నాణ్యత వల్ల కొవిడ్ ను ఎదుర్కొనే సామర్థ్యం అలాగే కొనసాగుతోందని స్పష్టం చేసింది.
అయితే.. అమెరికాకు చెందిన వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ వాస్తవ ఫలితాలను విశ్లేషించారు. వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని నెలల తర్వాత యాంటీబాడీల స్థాయి క్షీణిస్తున్నప్పటికీ.. రోగనిరోధక ప్రతిస్పందనలు మాత్రం స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా వైరస్ ఎటువంటి మార్పులకు గురికానంత వరకు తక్కువ యాంటీబాడీలు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి రక్తనమూనాలు, లింఫోనోడ్ లతో పాటు.. ఎముక మజ్జను కూడా తీసుకొని పరీక్షించినట్టు వెల్లడించారు. వాటిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేసే బీ కణాలు కొన్ని నెలలపాటు ఉంటున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న మొదట్లో కంటే 6 నెలల తర్వాతే మెరుగైన యాంటీబాడీలు ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. దీంతో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ వస్తే తప్ప.. వీటితో పూర్తి రక్షణ ఉంటుందనే భరోసాను కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు.