బంగారం దొంగల గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట దొంగలు బంగారాన్ని దొంగిలించడం, వారిని పోలీసులు పట్టుకుని రికవరీ చేయడం లాంటి నేడు సర్వసాధారణం అయిపోయాయి.
కానీ రొటీన్ కు భిన్నంగా ఇక్కడ బంగారాన్ని చీమలు దొంగతనం చేశాయి. దానికి సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతోంది.
ఆ వీడియోకు ఆయన ‘ స్మాల్ గోల్డ్ స్మగ్లర్స్’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఇప్పుడు ఈ స్మగ్లర్లపై ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆయన ప్రశ్నించారు. వాటికి ఎలాంటి శిక్ష విధించాలని అందులో రాసుకొచ్చారు.
దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘ ఇది ఒక పెద్ద కుట్రలాగా కనిపిస్తున్నది. ఆ స్మగ్లర్లు దాన్ని ఎక్కడికి, ఎందుకోసం తీసుకు వెళుతున్నారు తెలుసుకోవాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఆ చీమలు టీమ్ వర్క్ లో ఉండే బలాన్ని మనకు చూపించాయని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.