పక్షులు గూడు పెడుతాయి. చీమలు పుట్టలు పెడుతాయి. ఇందులో ప్రత్యేకత ఏం లేదు. అదే పక్షులు పెట్టే గూడులానే చీమలు కూడా చెట్టుపై గూడు పెడితే అది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అదేంటి చీమలు గూళ్లు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా.. అవునండి కోగులు అనే రకానికి చెందిన చీమలు చెట్టుపై గూళ్లు కట్టుకుంటాయి. మరీ ఆలస్యమెందుకు అదెక్కడో మీరే తెలుసుకోండి.
నిర్మల్ జిల్లాలోని ఓ చెట్టుపై కోగులు అనే చీమలు ఆకులనే ఆవాసంగా చేసుకుని గూడు నిర్మించుకున్నాయి. అయితే, అటుగా వెళ్తున్న పలువురు చీమలు పెట్టిన ఈ గూడును చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి అబ్బురపరిచే దృశ్యాలు చూడటం ఇదే మొదటిసారి స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Advertisements
అయితే, ఈ జాతికి చెందిన చీమలు అవి విసర్జించే జిగట లాంటి రసాయనంతో ఆకులను దగ్గరగా చేర్చి అతికిస్తూ గూడుగా మలుస్తాయని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు మహ్మద్ ఖలీమ్ తెలిపారు. ఆ గూళ్లు వర్షాలు, ఎండ, గాలులకు కూడా చెక్కుచెదరవని, వాటిలో రాణీ చీమలు నివాసం ఉండి.. సంతానాన్ని వృద్ధి చేస్తాయని ఆయన చెప్పారు. కూలీ చీమలు వాటికి కాపలా కాస్తాయని.. ఇవి తమ మనుగడ కోసం గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయని వివరించారు.