డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది టిల్లూ స్క్వేర్ మూవీ. అన్నీ తానై సిద్ధు జొన్నలగడ్డ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి అనుపమ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె తప్పుకుందా, యూనిట్ తప్పించిందా అనే విషయాన్ని పక్కనపెడితే.. టిల్లూ స్క్వేర్ కు అనుపమకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు.
ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంపై నర్మగర్బంగా స్పందించింది అనుపమ పరమేశ్వరన్. ప్రతి నిష్క్రమణం, మరో ఆగమనానికి సూచిక అంటూ కొటేషన్ పెట్టింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్.. టిల్లూ స్క్వేర్ సినిమాను ఉద్దేశించిందే అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇలా అవకాశాలు మిస్సవ్వడం అనుపమకు కొత్త కాదు. గతంలో ఏకంగా రంగస్థలం లాంటి సినిమానే మిస్సయింది ఈ బ్యూటీ. రామ్ చరణ్ కు బ్లాక్ బస్టర్ విజయాన్నందించిన ఆ సినిమాలో ముందుగా అనుపమనే తీసుకున్నారు. ఆ తర్వాత ఉన్నఫలంగా ఆమెను తప్పించి, ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు.
దీనిపై కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేసింది అనుపమ పరమేశ్వరన్. మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకు అదే సందర్భం ఎదురుకావడం బాధాకరం. ఒక్క అనుపమకే ఎందుకిలా జరుగుతోందంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ మొదలైంది అప్పుడే.