అందరికీ పూజాహెగ్డేలు, రష్మికలు, సమంతలు దొరకరు. వాళ్లు దొరికినా బడ్జెట్ సరిపోదు. మరి ఉన్నంతలో మినిమం బడ్జెట్ లో సినిమా తీస్తూ, కాస్త ఫేస్ వాల్యూ ఉన్న హీరోయిన్ కావాలంటే ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం అనుపమ పరమేశ్వరన్. క్రేజ్ ఉండి, చిన్న సినిమాలకు అందుబాటులో ఉన్న ఏకైక హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ.
పెద్ద సినిమా అవకాశాల కోసం ఎదురుచూడకుండా, స్టార్ హీరోల కోసం వెయిట్ చేయకుండా తన మనసకు నచ్చిన కథలు చేసుకుంటూ, చిన్న సినిమాలకు, కొత్త హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అనుపమ పరమేశ్వరన్. ఈ ఏడాది ఇప్పటికే రౌడీ బాయ్స్ సినిమాను రిలీజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా 3 సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేసింది.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన బట్టర్ ఫ్లై సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ప్రచారం ప్రారంభించి వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఆమె నటించిన 18 పేజెస్, కార్తికేయ-2 సినిమాలు రెండూ నిర్మాణ దశలో ఉన్నాయి. గమ్మత్తుగా ఈ రెండు సినిమాలూ హీరో నిఖిల్ వే.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ఒక్కో సినిమాకు అటుఇటుగా 50 లక్షల రూపాయలు తీసుకుంటోంది. మీడియం రేంజ్ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ, స్టార్ హీరోయిన్ కావాలని అనుకునే ప్రొడ్యూసర్లకు సరిగ్గా అందుబాటులో అంటోంది ఈ కేరళ కుట్టి. అయితే ఓవైపు ఇలా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు అందుబాటులో ఉన్నప్పటికీ, మరోవైపు పెద్ద సినిమా ఆఫర్లు రావడం లేదనే బాధ కూడా అనుపమ పరమేశ్వరన్ కు ఉంది. ఈమె ఎప్పుడు బిగ్ లీగ్ లోకి ఎంటరౌతుందో చూడాలి.