హిజాబ్ వ్యవహారం చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. బికినీ నుంచి హిజాబ్ దాకా దేన్నైనా ధరించే హక్కు మహిళలకు ఉందంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు.
ప్రియాంక వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. స్కూల్స్, కాలేజీలకు బికినీ వేసుకుని ఎవరు వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రియాంక వ్యాఖ్యలను తప్పుబట్టారు. విద్యా సంస్థలకు యూనిఫాం ఉందా? లేదా? అని అడిగారు.
ఇటు ప్రియాంక గాంధీ మరీ చీప్ గా బికినీ పదాన్ని వాడుతూ నీచమైన ప్రకటన చేశారని ఎమ్మెల్యే రేణుకాచార్య విమర్శించారు. కాలేజీల్లో చదువుకోడానికి వెళ్లే పిల్లలకు దుస్తులు నిండుగా ఉండాలని.. నిజానికి ఆడవాళ్ల వస్త్రధారణ చూసి మగవాళ్లు రెచ్చిపోవడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు. మహిళల్ని గౌరవించుకునే దేశం మనదన్న ఆయన.. బికినీ, యూనిఫాం మధ్య తేడా ప్రియాంక గాంధీకి తెలియదా? అని ప్రశ్నించారు.
స్కూళ్లు, కాలేజీల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి వీల్లేదని నిర్దేశించిన కర్నాటక ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. హిజాబ్ వ్యతిరేక, అనుకూల వర్గాల నిరసనలు, రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలతో అశాంతి వాతావరణం నెలకొంది.