మహారాష్ట్ర వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ చట్టం కింద 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.1.2 కోట్లకు పైగా పన్ను చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, సేల్స్ ట్యాక్స్ అధికారులు పంపిన నోటీసులను నటి అనుష్కశర్మ సవాలు చేశారు. ఈ మేరకు బాంబేహైకోర్టులో ఆమెరెండు పిటిషన్లు దాఖలు చేశారు. పైగా మూడేళ్ళుగా తనకు అందవలసిన బకాయిలను చెల్లించేట్టు చూడవలసిందిగా కూడా ఆమె కోరారు.
వీటిని పరిశీలించిన జస్టిస్ నితిన్ జమ్ దార్, జస్టిస్ అభయ్ ఆహూజా లతో కూడిన బెంచ్.. వీటిపై రెండు వారాల్లోగా స్పందించాలని సేల్స్ ట్యాక్స్ విభాగాన్ని కోరుతూ… తదుపరి విచారణ ఫిబ్రవరి 6 న జరగాలని నిర్ణయించింది. నటీ నటులకు వర్తింపజేసే పన్ను శ్లాబులనే తనకు వర్తింప జేయాలని, అలా కాకుండా.. అదనపు పన్నులు చెల్లించాలని అధికారులు తనకు నోటీసులు పంపారని అనుష్క శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
2012-16 మధ్య కాలంలో కూడా ఇదే అంశంపై ఆమె కోర్టులో నాలుగు పిటిషన్లు వేశారు. వివిధ సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్ ఆర్గనైజర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నటిగా చిత్రాలతో బాటు కొన్ని అవార్డు ఫంక్షన్లలో పాల్గొన్నానని, కానీ ప్రొడ్యూసర్లకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలని ఎలా కోరుతారని ఆమె ప్రశ్నించారు.
2012-13 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.2 కోట్లు, 2013-14 ఆర్ధిక సంవత్సరానికి రూ. 1.6 కోట్ల పన్ను చెల్లించాలని అధికారులు ఆమెకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.