సాధారణంగా గర్భంతో ఉన్న స్త్రీలు చాలా జాగ్రత్తలను తీసుకుంటుంటారు. బిడ్డ పుట్టే వరకు వారిని కుటుంబ సభ్యులు ఏ పనీ చేయనివ్వరు. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయమని వైద్యులు చెబుతుంటారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం వారు విటమిన్ ట్యాబ్లెట్లను ఇస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వారికి పోషకాహారం పెడతారు. అయితే గర్భంతో ఉన్నవారు వ్యాయామం పేరిట యోగాసనాలు వేయడం చాలా అరుదు. కానీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య,నటి అనుష్క శర్మ మాత్రం నిండు గర్భిణి అయి ఉండి కూడా చాలా అలవోకగా ఆసనాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అనుష్క శర్మ ఇటీవలే అత్యంత కఠినమైన శీర్షాసనం వేసింది. అది కూడా నిండు గర్భంతో ఉండి ఆసనం వేయడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తాను మాత్రం ట్రెనర్ల పర్యవేక్షణలో, డాక్టర్ల సూచనలతోనే ఆసనాలను వేస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈ క్రమంలోనే ఆమె శీర్షాసనం వేసినప్పుడు ఆమె భర్త విరాట్ కోహ్లి ఆమెకు సపోర్ట్‌గా ఆమె కాళ్లను పట్టుకుని కనిపించాడు. ఈ క్రమంలో తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఈ క్రమంలో రెండు జట్లు త్వరలో 3 టీ20లు, 4 టెస్టులు ఆడనున్నాయి. కేవలం మొదటి టెస్టుకు మాత్రమే కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. మిగిలిన 3 టెస్టులకు అతను పేటర్నిటీ లీవ్‌కు అప్లై చేయగా బీసీసీఐ అందుకు ఆమోదం తెలిపింది. అనుష్క శర్మ జనవరిలో బిడ్డను ప్రసవించనున్నందున కోహ్లి సెలవు తీసుకున్నాడు.